తాండూర్ రాజకీయాల్లో హాట్ టాపిక్..రైతు దీక్షకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డుమ్మా..!

తెలంగాణ వార్త:  తాండూరు నియోజకవర్గంలో ఈరోజు యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ముఖ్యమైన పార్టీ కార్యక్రమానికి ఆయన రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే తాండూర్ బీఆర్ఎస్‌లో వచ్చే ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో, ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ భవిష్యత్తుపై, నాయకత్వ మార్పులపై, టికెట్ సమీకరణాలపై స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

ఇక మరోవైపు శ్రీశైల్ రెడ్డి, రాజు గౌడ్ వంటి నాయకులు కేవలం సీనియర్లు మాత్రమే కాకుండా ప్రజల్లో బలమైన వాయిస్‌గా ఎదుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యల పై స్పందన, కేడర్‌తో అనుబంధం, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పాత్ర వీరికి మరింత బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు.

ప్రజల్లో తిరిగే నాయకుడికే తాండూర్‌లో భవిష్యత్ అనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవాలంటే గ్రౌండ్ లెవెల్‌లో బలం ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.