దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన పేర్కొన్నారు.
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువత జీవితాలతో రాజకీయాలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల నమ్మకాన్ని కాపాడాలంటే నీట్ పరీక్ష వ్యవస్థలో పూర్తి పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అలాగే, సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.
