తాండూరు May 15th (తెలంగాణ వార్త) : బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ మరియు పోలీసు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెలలో జరుపుకోనున్న బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
పండుగ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించిన ఎమ్మెల్యే, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అదేవిధంగా, బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
