సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు-కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరిక.!

తాండూర్, మే 17: తాండూర్ పట్టణంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నిర్వహించడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు విమర్శించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రతి శాఖకు ఒక విధమైన వ్యవస్థ, బాధ్యతలు ఉంటాయని, వాటి గురించి అవగాహన లేకుండా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

డ్రగ్స్ కేసులో దొరికిన రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పాలనలో రోజుకో తప్పుడు కేసు, రోజుకో ఘటన జరిగేదని, ఆ సంఘటనల్లో ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులే నిందితులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఎమ్మెల్యే నాయకత్వంలో ప్రజా పరిపాలన మెరుగుపడుతోందని తెలిపారు. ఈ మార్పులను జీర్ణించుకోలేని కొందరు అనవసర విషయాలకు ఎమ్మెల్యేను ముడిపెడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారని, ఆసుపత్రి పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కూడా ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారని పేర్కొన్నారు.

అయితే కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేద ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు దూరం చేసే కుట్రలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

అలాగే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేను ముస్లిం సోదరులకు దూరం చేయాలనే ఉద్దేశంతో తాండూర్‌లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే తాండూర్ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితమే క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులు, మున్సిపల్ ప్రతినిధులు, మైనారిటీ పెద్దలతో సమావేశం నిర్వహించి బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారని తెలిపారు.

ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధికి సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, కానీ అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే తాండూర్ ప్రజలు క్షమించరని పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు హెచ్చరించారు.