తాండూర్ , సెప్టెంబర్ 30 ( తెలంగాణ వార్త ప్రతినిధి): యాలాల మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో ప్రతిపాదిత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు తాండూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నన్ స్పందించారు. పాఠశాల నిర్మాణం 15 నెలలుగా శంకుస్థాపనకే పరిమితమైందంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని, పనులకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.
అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి :
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించడం సరికాదు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నప్పుడు అభివృద్ధి పనులకు రాజకీయ రంగు పులమడం ఎందుకు..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడం కంటే ముందుగా బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. “అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి అని సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నన్ అన్నారు.
15 నెలలు కాదు.. 15 వారాల్లోనే పనుల పురోగతి
బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లుగా 15 నెలలుగా పనులు నిలిచిపోయాయని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని మన్నన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి నాయకత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.పనులు చేపడుతున్న అధికారులు, అవసరమైన వనరులు సమకూరుస్తున్న నాయకులు కనిపించకపోవడం బాధాకరం. రాజకీయ ఆరోపణలతో సమయం వృథా చేయకుండా అభివృద్ధి పనులకు సహకరించండి. విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దాం” బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.దౌలాపూర్ సమీపంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయితే యాలాల మండలంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు విద్యాపరంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
