-యువత, నిరుద్యోగుల ఆశాజ్యోతి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి:
— తాండూరు నియోజకవర్గ ఎస్ఆర్ఐ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు పిలుపు
తాండూర్ అక్టోబర్ 2 తెలంగాణ వార్త ప్రతినిధి
హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ ఆర్ ఐ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు పిలుపునిచ్చారు. తాండూర్ నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోపు తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న తాండూర్ శాసనసభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి యువత, నిరుద్యోగుల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యే నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సొంత చొరవతో మెగా జాబ్ మేళాలు నిర్వహించి వందలాది మంది పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. అంతేకాకుండా, యువత పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు (DA) మంజూరు చేయడం ద్వారా నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి నిరూపితమైందన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ ఫారమ్-18 ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా తహసీల్దార్ కార్యాలయంలో గానీ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటు ఉన్నవారు కూడా తప్పనిసరిగా తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగుల, పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా ఏకమై మద్దతు తెలపాలని పురుషోత్తం రావు విజ్ఞప్తి చేశారు.
