వరి సాగుకు ప్రత్యామ్నాయంగా నూనెగింజల పంటలు


-వరి సాగుకు ప్రత్యామ్నాయంగా నూనెగింజల పంటలు

-నీటి కొరతను అధిగమించేందుకు విడతలవారీగా సాగు చేయాలి:

-మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్

తాండూరు, అక్టోబర్ 3 (తెలంగాణ వార్త ప్రతినిది )

రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల సాగులో మార్పులు చేసుకోవాలని, వరి సాగుకు ప్రత్యామ్నాయంగా నూనెగింజల పంటలను ప్రోత్సహించాలని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం, సమగ్ర వ్యవసాయ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారుశనివారం తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు తమకున్న భూమిని ఒకేసారి మొత్తం సాగు చేయకుండా విడతలవారీగా పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.ఉదాహరణకు రైతుకు 10 ఎకరాల భూమి ఉంటే మొత్తం 10 ఎకరాల్లో ఒకేసారి పంట వేయకుండా ఒకటి, రెండు ఎకరాల చొప్పున మూడు రోజుల వ్యవధిలో విడతలవారీగా సాగు చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. తద్వారా నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.అదేవిధంగా రైతులు అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందాలని సూచించారు. వరిపై అధికంగా ఆధారపడకుండా నూనెగింజల పంటల సాగును పెంచడం ద్వారా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవచ్చన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని, వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వడ్డే శ్రీనివాస్ కోరారు. తక్కువ నీటితో అధిక ప్రయోజనం పొందే పంటల వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి ఏవో కుమారయ్య ఆధ్వర్యం వహించగా, ఏడి అరుణ, సర్పంచ్ జె. లక్ష్మి, ఆత్మ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఏఈఓ సుమతో పాటు పలువురు రైతులు నారాయణ, ఆత్మ డైరెక్టర్ శామప్ప,పాల్గొన్నారు.