నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పై బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో తాండూరులో నిరసన..!

తాండూరు 13th May ( తెలంగాణ వార్త) : తాండూరు అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై  నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాండూరు బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ పంజాగుల శ్రీశైల్ రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకై పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు.

పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2024లో జరిగిన నీట్ పేపర్ లీకేజీ ఘటన నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుస వైఫల్యాలు విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారాయని అన్నారు.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని  సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా వారందరినీ కఠినంగా శిక్షించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు.

నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజాగుల శ్రీశైల్ రెడ్డి, దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, ఇంతియాజ్ పటేల్, మజార్, విక్రాంత్, రామకృష్ణ తదితర బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.