18th మే 2026 ( తెలంగాణ వార్త ) : కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన నాయకులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు మాట్లాడుతూ గత 45 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, వర్షాల కారణంగా ధాన్యానికి మొలకలు వచ్చి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలను పరిశీలించిన మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
సీఎం స్వంత నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
