తాండూరు, సెప్టెంబర్ 29 ( తెలంగాణ వార్త ప్రతినిధి): తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపించేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. తాండూరు పట్టణంలోని సెండ్ మార్క్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒకటో వార్డు నుంచి ఏడో వార్డు వరకు విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డు వార్డుకు తిరుగుతూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును సందర్శించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడమే స్పెషల్ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పురపాలక శాఖ అధికారులు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డుల ఇన్చార్జులు పాల్గొన్నారు
