ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు
స్పెషల్ డ్రైవ్‌లో విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
భోజనం నాణ్యత, మౌలిక వసతులు, బోధనపై ఆరా.. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచన
తాండూరు, సెప్టెంబర్ 29 ( తెలంగాణ వార్త ప్రతినిధి): తాండూరు మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 6వ వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే.. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం నాణ్యత, బోధన తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అలాగే విద్యార్థుల హాజరు శాతం, విద్యా ప్రమాణాలు, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు.
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా విద్యా సంస్థల పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్రెడ్డి వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ అధ్యక్షులు నాగు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.
