తాండూరు, సెప్టెంబర్ 30 ( తెలంగాణ వార్త ప్రతినిధి): చేయూత పెన్షన్ల మంజూరు, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తాండూరు నియోజకవర్గంలో చేయూత పెన్షన్ల విషయంలో ఎవరైనా చేతివాటం ప్రదర్శించినా, అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. పెన్షన్ల మంజూరు విషయంలో అక్రమ వసూళ్లు, అనర్హులకు ప్రయోజనం కల్పించడం లేదా అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.
పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరైనా ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు తేలితే పార్టీ పరంగా కూడా కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే పార్టీ నుంచి తొలగిస్తామని బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలు, వృద్ధులు, అర్హులైన లబ్ధిదారులకు చేరాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాల విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు.
ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు మధ్యలో ఎవరూ దారి మళ్లించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
