తాండూరు 14th May ( తెలంగాణ వార్త) : కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి పిస్టల్స్, వాహనాలు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, దోపిడీ అనంతరం నిందితులు బైకులపై మహారాష్ట్ర మీదుగా బెంగాల్‌కు పరారయ్యారు. ప్రత్యేక బృందాలు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ దోపిడీకి బీహార్‌కు చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోద్ సింగ్ మాస్టర్ మైండ్‌గా పోలీసులు గుర్తించారు. మొత్తం చోరీలో ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది ఈ దోపిడీ కుట్రలో పాల్గొన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్‌తో పాటు మరో 10 మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక పోలీసు బృందాలను ఉన్నతాధికారులు అభినందించారు.
