తాండూర్ పట్టణంలోని ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్య వారోత్సవాల సందర్భంగా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెంపు బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు కూడా సమానంగా తీసుకోవాలని అన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తుచేసుకున్నారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, టాయిలెట్లు వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు.
అలాగే గతంలో యూనిఫామ్‌లు, పుస్తకాలు నెలలు గడిచాక అందించేవారని, ఇప్పుడు పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్య వ్యవస్థపై ఖర్చు చేసే ప్రతి పైసా ఖర్చు కాదని, అది భవిష్యత్ తరాల అభివృద్ధికి పెట్టుబడిగా భావించాలని సూచించారు.
మన పిల్లలను ఎంత బాగా చదివిస్తే అదే మనకు గొప్ప ఆస్తి అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా విద్యా రంగంలో ఇంకా వెనుకబడి ఉందని, ఈ పరిస్థితిని మార్చి ఈసారి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే టాపర్లుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరచాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
