ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

హైదరాబాద్ ( 22 సెప్టెంబర్ 2026) : ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. L3 నుంచి L1 దశలకు చేరుకున్న 3,279 కేసులకు వన్‌టైమ్ క్లియరెన్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రవాణా, రోడ్లు భవనాల (గృహనిర్మాణం) శాఖ 2026 సెప్టెంబర్ 21న G.O.Rt.No.496 ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పోర్టల్‌లో నమోదైన వివరాల ప్రకారం ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్‌తో పాటు తదుపరి దశలకు చేరుకున్న 3,279 గృహాలను ఈ వన్‌టైమ్ క్లియరెన్స్ పరిధిలోకి తీసుకురానున్నారు.

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) మేనేజింగ్ డైరెక్టర్ 2026 ఆగస్టు 28న సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ వెసులుబాటు పొందిన లబ్ధిదారులను రాష్ట్ర పథకం కిందకు మార్చనున్నారు. ఫలితంగా కేంద్ర సాయం కింద రావాల్సిన రూ.27.20 కోట్ల నిధులు రద్దు కానుండగా, ఆ మేరకు అయ్యే ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న లబ్ధిదారులకు ఈ నిర్ణయం ద్వారా వెసులుబాటు కలగనుంది.