SC/ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్రస్థాయి సమీక్ష.!

హైదరాబాద్ (22 సెప్టెంబర్ 2026) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా SC/ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్రస్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

SC/ST వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసులు, దర్యాప్తు, విచారణ, పరిహారం, పునరావాసం తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.

గతంలో చివరిసారి 2013లో సమావేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి అని తెలిపింది.

బాధితులకు వేగంగా పరిహారం

SC/ST లైంగిక దాడుల బాధితులకు పరిహారం వేగంగా అందేలా గ్రీన్ ఛానల్ ద్వారా పరిహారం విడుదల చేసే విధానంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, విచారణ, పరిహారం, పునరావాసం వరకు ప్రతి దశను సమర్థవంతంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లలో SC/STలకు ప్రాధాన్యం

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో SC, ST కుటుంబాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం SCలకు, 17 శాతం STలకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్య, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం

అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడల్లో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నొక్కిచెప్పారు.

SC/ST వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.