సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..!

తాండూరు(25 సెప్టెంబర్ 2026): తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో ప్రజలకు అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు హైదరాబాద్ రోడ్డు మార్గంలో నూతన సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే నూతన భవన నిర్మాణానికి మంజూరు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, సేవల అందుబాటు, సిబ్బంది పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇకపై నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ ఆకస్మిక సందర్శనల్లో భాగంగా అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.