తాండూరు, సెప్టెంబర్ 30: తాండూరు పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన బాలప్ప కుమార్తె బాలమణి (25)తో పాటు ఆమెకు జన్మించిన నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, నవజాత శిశువు మృతి చెందారని ఆరోపించారు. ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజా మాలిక్ స్పందిస్తూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులుగా తేలిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఘటన విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలిచారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రభుత్వ సాయం అందించాలి
తల్లి, నవజాత శిశువు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని నాయకులు కోరారు. కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల సదుపాయాలు, సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందడంతో జినుగుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
