జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు హెల్త్‌కార్డులు, ఇంటి స్థలాలు, అక్రిడిటేషన్లు, రైల్వే పాసులు ఇవ్వాలి

గాంధీ జయంతి సందర్భంగా గన్‌పార్క్ వద్ద TUWJ నిరసన

తాండూర్ , అక్టోబర్ 2: (  తెలంగాణ వార్త ప్రతినిధి)

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆధ్వర్యంలో శుక్ర వారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా IJU మాజీ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, డి. అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, అక్రిడిటేషన్లు, రైల్వే పాసులు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి రిపోర్టర్‌కు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో IJU స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం.ఏ. మజీద్, IJU ఉపాధ్యక్షుడు వై. నరేందర్ రెడ్డి, NEC సభ్యుడు కె. సత్యనారాయణ, TUWJ అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, HUJ అధ్యక్షుడు ఎస్. శంకర్ గౌడ్, కార్యదర్శి షౌకత్‌తో పాటు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.