పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి నమోదు చేయించాలి: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి నమోదు చేయించాలి: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు, అక్టోబర్ 15 (తెలంగాణ వార్త ప్రతినిధి) ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 6 ఓటరు నమోదు చివరి తేదీ కావడంతో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.గురువారం తాండూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఓటరు నమోదు అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించాలని కోరారు. గడువులోగా ప్రతి అర్హుడూ దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం గురించి అర్హులకు సరైన సమాచారం అందించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఎస్‌ఆర్‌ఐ తాండూరు డివిజన్ కన్వీనర్ కర్ణం పురుషోత్తమరావు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.