తాండూర్ మే 21 : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బతుల నాగు ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
తాండూర్ పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ధరసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీ బతుల నాగు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బతుల నాగు మాట్లాడుతూ, దేశానికి కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించిన మహానేతగా, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఆధునిక భారత నిర్మాతగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నాయకులతో కలిసి తాండూర్ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.
