తాండూర్ మే 22 : తాండూర్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.
ఇప్పటివరకు ఒక్క నాయకుడి చుట్టూ తిరిగిన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు పలువురు నేతల వైపు మళ్లుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత తాండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల రెడ్డి , రాజుగౌడ్, శుభప్రద్ పటేల్ వంటి నాయకులు ప్రజల్లో మరింత చురుకుగా కనిపిస్తూ పార్టీ శ్రేణులను సమీకరించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మరి కొంతమంది సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ , దీపా నర్సింలు వంటి నాయకులు ఆశావహుల ఉన్నట్టు తెలుస్తుంది.
గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో మంతనాలు జరపడం, ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీ అధిష్టానం కూడా తాండూర్‌లో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య తాండూర్ బీఆర్ఎస్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
