సుప్రీం కోర్టులో ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్.!

న్యూఢిల్లీ, మే 25: సోషల్ మీడియాలో ప్రధాన రాజకీయ పార్టీలకే సవాల్ విసురుతున్నట్లు భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాల పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌లో పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రచార విధానాలు, ఫాలోవర్ల పెరుగుదల వెనుక ఉన్న ఆర్థిక వనరులు, డిజిటల్ ప్రచార నెట్‌వర్క్‌ల పై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా పిటిషన్‌లో ప్రస్తావించబడ్డాయి.

అంతేకాకుండా, కొందరు వ్యక్తులు నకిలీ అడ్వకేట్లుగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని కూడా పిటిషనర్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయ వ్యవస్థ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫేక్ అడ్వకేట్ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.