( తెలంగాణ వార్త ) మే 25 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నుంచి “ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా” పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత భీమా రక్షణ కల్పించనున్నారు. కులం, మతం, ఆర్థిక స్థితి అనే భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికీ ఈ భీమా వర్తించనుండటం విశేషం.
ప్రజల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం, కుటుంబాలకు భరోసా కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. తెలంగాణ సంక్షేమ పాలనలో “ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా” మరో మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
