ఇందిరా పార్క్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నా..!

హైదరాబాద్ మే 26 : ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ,ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుమారు 50 వేల ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుందని, ఇది దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, హక్కుల కోసం పోరాటం చేస్తున్న లంబాడీ బిడ్డలపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారని ఆయన ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కార్పొరేషన్ల పేరుతో ప్రకటించిన పథకాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఆర్థిక సహాయం ఇవ్వలేదని విమర్శించారు.

ఇందిరా పార్క్ నుంచి ప్రారంభమైన ఈ పోరాటం ప్రతి తండాకు చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయకపోతే ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.