తాండూర్ మే 26 : తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నకిలీ ఫోన్ కాల్ చేసి మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ “దిలీప్ కుమార్” పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారు. వెంటనే కాల్ వివరాలను ధృవీకరించిన ఆయన, ఇది మోసపూరిత కాల్ అని గుర్తించారు.
ఇటీవల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కు కూడా ఇలాంటి నకిలీ కాల్ వచ్చిన ఘటనను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే, వెంటనే వికారాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ పేర్లతో ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడే ప్రయత్నాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే నకిలీ గుర్తింపులతో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం మరియు సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
