సిద్దిపేట మే 27 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోలేక తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను పరామర్శించిన హరీశ్ రావు.. “అధైర్యపడొద్దు.. మీకు అండగా ఉంటాం.. రైతుల కోసం చివరి వరకు పోరాడతాం” అంటూ భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఒకరి పై ఒకరు నెపం నెడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనుగోలు విషయంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ లెవీ కోటా, ఎరువుల కోటాను సమయానికి ఇవ్వకుండా రాష్ట్ర రైతులను మోసం చేస్తోందని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలతో బంగారు పంటలు పండించిన రైతులు.. నేడు ఆ పంట అమ్ముకోలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్‌లైన్ ట్యాగింగ్, కొత్త నిబంధనల పేరుతో నెలరోజుల పాటు కాలయాపన చేయడంతో రైతులు తీవ్ర నష్టపోయారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చుని 80 శాతం వడ్లు కొనుగోలు చేశామని చెబుతున్నారని.. కానీ గ్రామీణ మార్కెట్లలో ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే ఉందని స్పష్టం చేశారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించిన హరీశ్ రావు.. వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అధికారులకు ఫిర్యాదు చేస్తే రైతులే మాట్లాడుకోవాలని చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు.
ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్‌గా నమోదు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని.. తరుగు పేరుతో, రవాణా ఛార్జీలు, హమాలీ, ట్రాక్టర్ వెయిటింగ్ ఛార్జీలు, కాంటా ఖర్చులు అన్నీ రైతులపై మోపుతూ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.
90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇవ్వడం అన్యాయమన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ధర్నాలు చేయడం కాకుండా ఢిల్లీ వెళ్లి కోటా పెంపు కోసం పోరాడాలని సూచించారు.
కేసీఆర్ హయాంలో కేంద్రం కొనకపోయినా సన్ ఫ్లవర్, జొన్నలు, శనగలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికే రెండు నెలలుగా సన్ ఫ్లవర్ కొనుగోలు నిలిచిపోవడంతో పంట చెదలు పడుతోందని.. గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
వానాకాలం సమీపిస్తున్నా ఇప్పటికీ విత్తనాలు, ఎరువుల నిల్వలు సిద్ధం చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులపై భారం మోపుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచి మరో భారాన్ని మోపుతోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో పెంచిన 27 శాతం వ్యాట్‌ను 10 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
బక్రీద్ పండుగ నేపథ్యంలో లారీ డ్రైవర్లు అందుబాటులో ఉండరని.. కాబట్టి ప్రభుత్వం వారం రోజుల పాటు ఇసుక రవాణాను నిలిపివేసి, ఆ లారీలను వడ్ల రవాణాకు వినియోగించాలని సూచించారు.
“ప్రభుత్వానికి రైతులు ముఖ్యమా..? ఇసుక ఆదాయం ముఖ్యమా..?” అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
