హైదరాబాద్ (24 సెప్టెంబర్ 2026) : బీఆర్ఎస్ నేతలు, వారి అనుబంధ వ్యక్తులకు సంబంధించిన పలు భూ వ్యవహారాల్లో చోటుచేసుకున్నట్లు పేర్కొన్న అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లోని భూములకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 24న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, భూ యాజమాన్యం, నిషేధిత భూములు, ఆక్రమణలు, చట్టాలు–నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. అవసరమైన ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థలు, ఇతర అధికారుల నుంచి రికార్డులను కోరే అధికారం కమిటీకి కల్పించారు. విచారణ అనంతరం బాధ్యతను నిర్ధారించి, తగిన చర్యలకు సిఫారసులు చేయనుంది.
రోహిత్ రెడ్డి భూములపైనా కమిటీ దృష్టి
ఈ విచారణలో మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి అజీజ్‌నగర్‌లో ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలు కూడా కమిటీకి అందించిన అంశాల్లో నివేదికలు పేర్కొంటున్నాయి.
అజీజ్‌నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో రోహిత్ రెడ్డికి సంబంధించినట్లు పేర్కొన్న భూములు, ఫామ్‌హౌస్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ విచారణకు ఈ భూ వ్యవహారాలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎర్రవల్లి నుంచి అజీజ్‌నగర్ వరకు.. విస్తృత విచారణ
మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎర్రవల్లి భూములు, జన్వాడలోని భూములు, మాజీ మంత్రి హరీశ్ రావుకు సంబంధించినట్లు పేర్కొన్న రామంచ భూములు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సంబంధించిన భూములు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భూములు, అలాగే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్ భూములు తదితర అంశాలు కమిటీ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి.
విచారణ పరిధి అవసరాన్ని బట్టి మరిన్ని గ్రామాలు, మరిన్ని భూ వ్యవహారాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది.
భూముల యాజమాన్యం, రికార్డులు, నిషేధిత జాబితాల్లోని భూములు, ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములకు సంబంధించిన అంశాలు, అనుమతులు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల అమలు వంటి అంశాలపై కమిటీ వాస్తవాలను పరిశీలించనుంది.
విచారణ పూర్తయిన తర్వాత కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.
