తాండూర్, జూన్ 13: తాండూర్ పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ల కోసం అవగాహన మరియు శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై సర్పంచ్‌లకు, నాయకులకు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా పేదల జీవనోపాధికి భరోసా కల్పించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా కార్పొరేట్ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, తాండూర్ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
“పదవి అనేది ఆభరణం కాదు… ప్రజలకు సేవ చేసే బాధ్యత. సర్పంచ్‌గా ఎన్నిక కావడం అదృష్టం, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవాలి” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
మాట, నడవడిక, మర్యాద, పనితనం ద్వారా మాత్రమే ప్రజల గౌరవం, ప్రేమ లభిస్తాయని పేర్కొన్న ఆయన, గ్రామాల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. అభివృద్ధి పనులు, పరిపాలనకు సంబంధించిన సందేహాలపై తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, తాండూర్ క్యాంపు కార్యాలయంలో వారానికి మూడు నుంచి నాలుగు రోజులు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్, పోలీస్ స్టేషన్ లేదా ఇతర సమస్యల విషయంలో నేరుగా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, RGPRS ఇంచార్జ్ సుభాష్, ట్రైనర్లు రాము, సతీష్, జాఫర్, కరుణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, రాజ్‌కుమార్, రాజవర్ధన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
