ముజాహిద్‌పూర్ హైస్కూల్‌లో సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి..!

తెలంగాణ వార్త  మే 11 :  వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను పరిగి ఎమ్మెల్యే టీ రామ్ మోహనరెడ్డి ప్రారంభించారు. రూ.13.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ల్యాబ్‌తో పాటు సమ్మర్ క్యాంప్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. సైన్స్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృక్పథం పెంపొందుతుందని తెలిపారు. సమ్మర్ క్యాంప్‌లు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.


అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి విద్యాభ్యాసం, పాఠశాలలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.